క్రీడల అభివృద్ధికి భారీ ప్రణాళికలు…
ఖేలో ఇండియా నిధుల కోసం ప్రయత్నం
రూ.150కోట్ల నిధుల లక్ష్యంతో శాప్ ప్రతిపాదనలు
త్వరలో కొత్త క్రీడా అకాడమీలు ప్రారంభం
క్రీడాకారుల అవసరాలు అనుగుణంగా
మౌలిక సదుపాయాలు
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో పూర్తి పారదర్శకత..
ఆరోపణలు ఆధిపత్య పోరులో భాగమే
ఆంధ్రప్రభతో శాప్ ఎండీ ఎస్ భరణి
(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ ) : రాష్ట్రంలో క్రీడారంగాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రానికి మరింత నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ఈసారి రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. గురువారం ఆంధ్రప్రభకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర క్రీడారంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, కొత్త అకాడమీలు, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలపై వచ్చిన ఆరోపణలు తదితర అంశాలపై ఆయన వివరంగా మాట్లాడారు.
ఖేలో ఇండియా నిధులు…
గత ఏడాది ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రానికి సుమారు రూ.70 కోట్ల నిధులు లభించాయని, ఆ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని శాప్ ఎండి ఎస్ భరణి తెలిపారు. ఈసారి రాష్ట్రంలోని క్రీడాకారుల అవసరాలను సమగ్రంగా అంచనా వేసి, ప్రాధాన్యతా క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సమాన అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వివరించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో…
రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామని శాప్ ఎండీ భరణి తెలిపారు. ఆధునిక శిక్షణ కేంద్రాలు, క్రీడా మైదానాలు, అవసరమైన పరికరాలు, కోచ్‌ల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్రంలోనే అత్యుత్తమ శిక్షణ పొందేలా చర్యలు చేపడుతున్నామని భరణి పేర్కొన్నారు.
పునర్జీవన్ దిశగా క్రీడా వికాస కేంద్రాలు..
గతంలో నిధుల కొరతతో వివిధ దశల్లో నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రాల పనులను వేగవంతం చేశామని, ప్రస్తుతం అవి తుది దశకు చేరుకున్నాయని శాప్ ఎండి ఎస్ భరణి తెలిపారు. ఆ కేంద్రాలు పూర్తయిన తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
పాఠశాల నుండి క్రీడాకారుల గుర్తింపు..
పాఠశాల స్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తోందని శాప్ ఎండి భరణి వివరించారు. విద్యాశాఖతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థుల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ అందించే వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు.
నాలుగు కొత్త అకాడమీలు….
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వ హయాంలో నాలుగు కొత్త క్రీడా అకాడమీలు ప్రారంభించనున్నట్లు శాప్ ఎండీ ఎస్ భరణి వెల్లడించారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం కేంద్రాలుగా ఈ అకాడమీలు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ అకాడమీల ద్వారా ప్రత్యేక క్రీడాంశాల్లో నిపుణులైన కోచ్‌లతో శిక్షణ, ఆధునిక సదుపాయాలు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు దీర్ఘకాలిక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.
స్పోర్ట్స్ కోటపై ఆరోపణలు అవాస్తవం…
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన శాప్ ఎండీ భరణి, అవి వాస్తవాలకు దూరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కొన్ని క్రీడా సంఘాలు, అసోసియేషన్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరులో భాగంగానే శాప్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. స్పోర్ట్స్ కోటా కింద జరిగిన అన్ని ఎంపికలు సంబంధిత క్రీడా సంఘాలు, అసోసియేషన్లు, ఫెడరేషన్లు జారీ చేసిన ధ్రువపత్రాల ఆధారంగానే నిర్వహించామని వివరించారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎంపికను పూర్తిస్థాయిలో పరిశీలించి, అన్ని నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, పక్షపాతం లేదా అనుమానాలకు తావు లేదని భరణి పేర్కొన్నారు. ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, క్రీడాకారుల ప్రయోజనాలే తమ ప్రధాన లక్ష్యమని ఎండీ ఎస్ భరణి స్పష్టం చేశారు.
