పండగలా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం…

పండగలా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం…
ఈ నెల 18న చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు
విజయవాడ బాపూ మ్యూజియంలో ప్రత్యేక కార్యక్రమాలు
ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయండి
వారసత్వ సంపదకు నెలవైన మ్యూజియాల విశిష్టతను చాటిచెప్పండి
మీడియా సమావేశంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : నవ్య రాజధాని అమరావతికి గేట్‌వే అయిన విజయవాడ ప్రాంతంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం (International Museum Day) సందర్భంగా పండగలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
పర్యాటక, పురావస్తు శాఖలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో, విజయవాడ ఉత్సవ్ కమిటీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే జ్ఞాన నిలయాలే మ్యూజియాలన్నారు. గత వైభవాన్ని నేటి తరానికి, నేటి సంస్కృతిని రేపటి తరానికి అనుసంధానించే వారధులుగా మ్యూజియాలు పనిచేస్తాయని పేర్కొన్నారు.

“మ్యూజియమ్స్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్” అనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1887లో స్థాపితమైన విజయవాడ బాపూ మ్యూజియాన్ని ఈ నెల 18న ఉచితంగా సందర్శించవచ్చని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో 14 పురావస్తు మ్యూజియాలు, మ్యూజియం క్షేత్రాలు ఉన్నాయని ఆయన వివరించారు.
బాపూ మ్యూజియంలో రోజంతా ప్రత్యేక కార్యక్రమాలు
ఈ నెల 18న ఉదయం బాపూ మ్యూజియంలో కల్చరల్ ఓపెనింగ్‌తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం “మ్యూజియమ్స్ ఇన్ ది మోడర్న్ డే” అంశంపై ప్రత్యేక చర్చలు, గైడెడ్ మ్యూజియం టూర్, విజయవాడ హెరిటేజ్ క్విజ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
దేశభక్తిని పెంపొందించేలా మ్యూజియాల విశిష్టతను చాటిచెప్పే లేజర్ షో, హెరిటేజ్ ఫోటోగ్రఫీ హంట్, పెయింటింగ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేసి సత్కరించనున్నట్లు వెల్లడించారు.
సాయంత్రం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో “Roots Reloaded” కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రముఖ గాయని గీతా మాధురి బృందంతో పాటు “బ్యాండ్ సెహారీ” లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుందని చెప్పారు.
విద్యార్థులు, యువత, పౌరులు, వివిధ సంస్థలు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. గౌరవ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ. శిల్ప, ఆర్కియాలజీ డిప్యూటీ డైరెక్టర్ ఎం. రామసుబ్బారెడ్డి, ఏడీలు వెంకటరావు, నరసింహనాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధి వీఎం సుధర్మ తదితరులు పాల్గొన్నారు.
