డీఎస్సీ-2025 అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి
- కైకలూరులో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష
- మంత్రి నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్
కైకలూరు, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ-2025 పరీక్షల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కైకలూరులో మండల స్థాయి రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
కైకలూరు–ఏలూరు రోడ్డులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ దీక్షకు కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాంబాబు (రాము), కైకలూరు టౌన్ పార్టీ అధ్యక్షులు సమయం రామాంజనేయులు (అంజి) ఆధ్వర్యం వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్) హాజరై మాట్లాడారు. డీఎస్సీ-2025పై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
