వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం
- నశా ముక్త్ భారత్ అభియాన్’లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
- వ్యసన రహిత భారత ప్రతిజ్ఞ.. పోస్టర్ల ఆవిష్కరణ
- ప్రతి కుటుంబం మత్తు పదార్థాలకు ‘నో’ చెప్పాలని సూచన
తిరువూరు, ఆంధ్రప్రభ : వ్యసనాల నిర్మూలనే ఆరోగ్యవంతమైన, ఆనందమయ భారత నిర్మాణానికి తొలి అడుగని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ (వ్యసన రహిత భారత్) అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి పౌరుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులను కూడా వ్యసనాలకు దూరంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యసనాలు వ్యక్తి ఆరోగ్యాన్ని, కుటుంబ శాంతిని, సమాజ అభివృద్ధిని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలిసి ‘నశా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేయించి, అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమం కోసం రూపొందించిన క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆన్లైన్లో కూడా వ్యసన రహిత భారత ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు. వ్యసనాలకు “నో” చెప్పడం, కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, సమాజానికి ప్రేమతో సేవ చేయడం, జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవడం, ఆధ్యాత్మిక విలువలను అలవరచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. “నశా రహిత భారత్ – ఆరోగ్యకర భారత్ – ఆనందమయ భారత్” నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
