వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేత చేరిక..

వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేత చేరిక..
బేవర నారాయణకు పసుపు కండువా కప్పిన ఎమ్మెల్యే బొండా ఉమా
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే ప్రజల మద్దతు
సెంట్రల్‌లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు..
పాయకాపురం – ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో చేపడుతున్న ప్రజా సంక్షేమ చర్యల పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత బేవర నారాయణ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బొండా ఉమామహేశ్వరరావు వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమం, మహిళా సాధికారత, యువత ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు.
పార్టీలో చేరిన బేవర నారాయణ మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు అని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువచ్చి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని పేర్కొన్నారు.
బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్న ఎమ్మెల్యే నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
పార్టీలో చేరిన వారిలో మద్దిల గురుమూర్తి, సుఖవాసి రమణ, సుఖవాసి పాపారావు, అనకాపల్లి శ్యామలరావు, బుగత సురేష్, సికటాపు రాంబాబు, జుజ్జువరపు నాగరాజు, బలగా శ్రీను తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బేవర సూర్య, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, డివిజన్ ఇంచార్జ్ ఎం. మల్లేశ్వరరావు, సీనియర్ నాయకుడు బుగత శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
