ఆరోగ్య భరోసా కల్పిస్తున్న కూట‌మి ప్రభుత్వం…

గత ప్రభుత్వంలో ప్రజలకు తలుపులు మూసివేస్తే…
కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్‌ను ఇంటింటికీ చేర్చింది..
ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు..
29వ విడతలో 134 మందికి రూ.56 లక్షల చెక్కుల పంపిణీ
29 విడతల్లో 1,140 మందికి రూ.8.20 కోట్లకు పైగా ఆర్థిక సాయం

తిరువూరు, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నా మని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరువూరులోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) 29వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 134 మంది లబ్ధిదారులకు సుమారు రూ.56 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తిరువూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 29 విడతల్లో మొత్తం 1,140 మంది లబ్ధిదారులకు రూ.8,20,43,654 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి అందించినట్లు తెలిపారు. వైద్య చికిత్సలు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల కష్టాలను అర్థం చేసుకుని వెంటనే స్పందించే నాయకత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని కొనియాడారు.

తిరువూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయి బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శక విధానంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయనిధి అందేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజలకు అందాల్సిన ప్రతి సంక్షేమ పథకం సకాలంలో చేరేలా తాము నిరంతరం కృషి చేస్తున్నామని, ముఖ్యమంత్రి సహాయనిధికి అర్హులైన వారు ఎలాంటి సందేహం లేకుండా తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజాసేవే తమ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి కుటుంబానికి అండగా నిలవడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఆపద సమయంలో ఆదుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, తమ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి సహాయనిధి అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.