కొత్త రోడ్లతో కళకళలాడుతున్ననియోజకవర్గం
- రూ.207 కోట్లతో 307 కి.మీ. రహదారుల నిర్మాణానికి శ్రీకారం
- రెండేళ్లలో రూ.100 కోట్లతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి
- మరో 70 రోడ్లు, వంతెనల పనులు పురోగతిలో
- బడి, గుడి, ఆసుపత్రులకు మెరుగైన అనుసంధానం
- మత్స్యకార కాలనీల్లో సీసీ రోడ్లు.. గ్రామాల్లో మౌలిక వసతులకు ఊతం
- తుపాన్లతో దెబ్బతిన్న అమరవిల్లి రహదారికి పునర్జీవం
- 8 వేల మందికి ఊరటనిచ్చిన కొండెవరం రోడ్డు
- పల్లెపండుగ 2.0తో రైతులకు డొంక రోడ్ల సౌకర్యం
- దశాబ్దాల రహదారి సమస్యలకు చెక్ వేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పిఠాపురం, ఆంధ్రప్రభ: పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామాల నుంచి పట్టణాల వరకు రహదారి వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు వెచ్చిస్తోంది. ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణం, పాత రహదారుల పునర్నిర్మాణం చేపట్టింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, రోడ్లు-భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో మొత్తం 307 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 611 రోడ్లు పూర్తయ్యాయి. వీటి మొత్తం పొడవు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కుపైగా రహదారుల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. లక్ష్యంగా పెట్టుకున్న పనుల్లో దాదాపు 80 శాతం పూర్తి కావడంతో నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడింది.
స్థానిక ఎమ్మెల్యేగా ప్రజలు కోరిన ప్రతి రహదారికి ఆమోదం తెలిపిన పవన్ కళ్యాణ్, అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రైతులు పంటలను సులభంగా తరలించేందుకు వ్యవసాయ రహదారులు, మత్స్యకారులకు జెట్టీలకు అనుసంధాన మార్గాలు, గ్రామాల మధ్య అంతర్గత రోడ్లు, సామాజిక అవసరాలకు ఉపయోగపడే రహదారులను ప్రాధాన్యంతో నిర్మించారు. ఉప్పాడ తీర ప్రాంతంలోని జెట్టీకి వెళ్లే బురద రహదారి కారణంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి అక్కడ గ్రావెల్ రహదారిని నిర్మించడం ద్వారా రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.
13 ఏళ్ల తర్వాత పునరావాస కాలనీలకు సిమెంట్ రోడ్లు
సముద్ర కోతతో ఇళ్లను కోల్పోయిన మాయాపట్నం మత్స్యకారులకు 13 సంవత్సరాల క్రితం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీలో పునరావాసం కల్పించినప్పటికీ, మౌలిక వసతులు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.1.52 కోట్లతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మించారు. దీంతో కాలనీ మొత్తం ఆధునిక మౌలిక వసతులతో రూపుదిద్దుకుంది.
అదేవిధంగా సమీపంలోని కొత్తసూరాడపేట పునరావాస కాలనీలో నివసిస్తున్న 330 కుటుంబాల కోసం రూ.93 లక్షలతో 1.6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించి, వాటిని సుబ్బంపేట–కొత్తపల్లి ప్రధాన రహదారితో అనుసంధానం చేశారు.
తుపానుతో దెబ్బతిన్న బీచ్ రోడ్డుకు కొత్త జీవం
యు.కొత్తపల్లి మండలం అమరవిల్లి–రామన్నపాలెం బీచ్ రోడ్డును తుపాన్లు, భారీ వర్షాలు పూర్తిగా ధ్వంసం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.88 లక్షలతో రహదారిని పూర్తిగా పునర్నిర్మించారు. దీని వల్ల సుమారు 2 వేల మంది ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు బషీర్ బీబీ ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా సౌలభ్యం ఏర్పడింది.
ఎస్ఈజెడ్ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం
అభివృద్ధికి దూరంగా ఉన్న ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి రూ.79.70 లక్షలతో శాశ్వత రహదారి నిర్మించారు. అలాగే ఎస్ఈజెడ్ పరిమితుల నుంచి గ్రామాన్ని విముక్తి కల్పిస్తూ అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేశారు.
కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల డిమాండ్ అయిన శ్మశానవాటికకు వెళ్లే మార్గంలో రూ.26.30 లక్షలతో 411 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు. ఈ రహదారి ద్వారా సుమారు 4 వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతున్నారు.
ఏడేళ్ల నిరీక్షణకు ముగింపు
యు.కొత్తపల్లి మండలంలోని కొండెవరం గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న పిఠాపురం–ఉప్పాడ ఆర్‌అండ్‌బీ రహదారి ఏడేళ్లుగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.1.22 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.17 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. ఈ మార్గం ద్వారా సుమారు 8 వేల మంది ప్రజలు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు ప్రయోజనం పొందుతున్నారు.
గుంతల రోడ్లకు శాశ్వత పరిష్కారం
ఎన్నికలకు ముందు ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిన వినతుల్లో రహదారుల సమస్యే ప్రధానమైంది. గొల్లప్రోలు మండలం వెన్నెపూడి–జీఎన్టీ రోడ్డును రూ.85 లక్షలతో 1.60 కిలోమీటర్ల మేర పునర్నిర్మించారు. రెండు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న 3,800 మంది ప్రజలకు ఇది ఊరటనిచ్చింది. అలాగే గొల్లప్రోలు–తాటిపర్తి పుంత రహదారిని రూ.1.46 కోట్లతో 2.90 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. రైతులు, స్థానిక ప్రజల రవాణా సమస్యలు తగ్గాయి. కొడవలి గ్రామంలో 370 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణంతో సుమారు 4 వేల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరింది.
ఈబీసీ కాలనీలో కొత్త వెలుగు
చిత్రాడ గ్రామంలోని ఈబీసీ కాలనీలో రూ.3 కోట్లతో 1,500 మీటర్ల సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు ఆధునిక డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల భద్రత దృష్ట్యా రూ.50 లక్షలతో ప్రహరీ గోడ నిర్మించారు.
‘పల్లెపండుగ 2.0’లో రైతులకు ప్రాధాన్యం
వీబీజీఆర్ నిధులతో చేపట్టిన ‘పల్లెపండుగ 2.0’ కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే డొంక రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పి.రాయవరం, బి.ప్రత్తిపాడు పుంత గ్రామాల్లో రూ.కోటికి పైగా ఖర్చు చేసి 3 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు నిర్మించారు. దీంతో 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
నాణ్యత విషయంలో రాజీలేదు
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నిర్మాణంలో ఉన్న 70 కిలోమీటర్ల పెండింగ్ రహదారులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ప్రతి పనిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
