Maharashtra | రూ.5 చెల్లిస్తే.. ఖాతా ఖాళీ..!

రూ.8.18 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లు


Maharashtra | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేవలం రూ.5 ఆన్‌లైన్ చెల్లింపు కోసం ప్రయత్నించిన మహిళ.. ఏకంగా రూ.8.18 లక్షలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని భారీగా నష్టపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కల్యాణ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ డాక్టర్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో రూ.5 చెల్లించింది. చెల్లింపు పూర్తయిన కొద్దిసేపటికే ఆమె బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా మొత్తం రూ.8.18 లక్షలు మాయమయ్యాయి.

బ్యాంకు నుంచి వచ్చిన లావాదేవీల సందేశాలను చూసిన మహిళ తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్ చెల్లింపులు చేసే సమయంలో అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని, అనుమానాస్పద లింకులు, యాప్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.