తొర్రూరులో ఘనంగా ముత్యాలమ్మ బోనాల వేడుకలు

తొర్రూరు (ఆంధ్రప్రభ): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ముత్యాలమ్మ బోనాల వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. అమ్మపురం రోడ్డులో గోల్కొండ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ తూనం శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

మున్సిపల్ కార్యాలయం సమీపంలోని బొడ్రాయి, గోల్కొండ ముత్యాలమ్మ ఆలయం, కాలనీలోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్‌ఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సాయంత్రం జరిగే ప్రధాన బోనాల వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొంటారని చెప్పారు. బోనాల సందర్భంగా పట్టణంలోని చికెన్ దుకాణాలు ఉదయం నుంచే రద్దీగా మారగా, మున్సిపల్ పాలకవర్గం ఆలయాలను సందర్శించి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించింది.