సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ రాజేష్ చంద్ర
వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఎవరికీ వెల్లడించొద్దు
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచన
బిక్కనూర్ (ఆంధ్రప్రభ): సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరూ మోసపోవద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలకు సూచించారు. బుధవారం బిక్కనూర్ మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలను నమ్మి వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు.

గ్రామాల్లోకి అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని, దొంగతనాల నివారణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి సమాజంలో ఆదర్శంగా నిలవాలని, మహిళలు ప్రజా రవాణాలో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పాల్గొన్న వారితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పట్టణ సర్పంచ్ రేఖా సుదర్శన్, డీఎస్పీ మధుసూదన్, సీఐ నరేష్, ఎస్సై అనిల్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, యువకులు పాల్గొన్నారు.
