ఎల్ఐసీ వాటాల విక్రయ నిర్ణయం దగా!

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి విమర్శ

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 5 (ఆంధ్రప్రభ): భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో మరో 6.5 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు.
ప్రజల విశ్వాసాన్ని సంపాదించి దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా ఎదిగిన ఎల్ఐసీలో వాటాలను విక్రయించడం అంటే సంస్థను క్రమంగా బలహీనపరచడమేనని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మంది పాలసీదారుల నమ్మకం, వారి పొదుపు సొమ్ముతో అభివృద్ధి చెందిన ఎల్ఐసీ దేశ మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక అవసరాల కోసం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూర్చిన కీలక ప్రభుత్వ రంగ సంస్థ అని గుర్తు చేశారు.


ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాలను విక్రయించిందని, ఇప్పుడు మరో 6.5 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రయత్నించడం ప్రజారంగ సంస్థలను బలహీనపరిచే చర్యగా భావించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ద్రవ్యలోటు పూడ్చేందుకు లాభదాయకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం దేశ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని, ఇటువంటి నిర్ణయాలు దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.


ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం, వాటి ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించడం వంటి ప్రత్యామ్నాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని నరసింహులు కోరారు. ఎల్ఐసీలో వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనలకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎల్ఐసీ వాటాల విక్రయ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.