పోలీస్ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్

భూపాలపల్లి ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణలో పోలీసు శాఖ, ఎస్‌పీఎఫ్, జైళ్ల శాఖల్లో 7,112 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూపాలపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాలు సాధించేలా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ కోచింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు.

జిల్లాలోని పేద, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీసు ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అర్హత కలిగిన ఫిజికల్ ట్రైనర్ల ఆధ్వర్యంలో తరగతులు నిర్వహించడంతో పాటు ఉచిత వసతి, శారీరక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 4 నుంచి 15వ తేదీ వరకు సమీప పోలీస్ స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మహిళా అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోచింగ్ ప్రారంభ తేదీ, శిక్షణా కేంద్రం వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. క్రమశిక్షణతో శ్రమిస్తే పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని యువతకు పిలుపునిచ్చారు.