ఉర్దూ పాఠశాల అభివృద్ధికి చర్యలు
- ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో పనులు
- విద్యాధరపురం షేక్ బాజీ సాహెబ్ పాఠశాలలో సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన
- తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు
- త్వరలో అంచనా నివేదిక రూపొందించి అభివృద్ధి పనులకు శ్రీకారం
భవానిపురం,ఆంధ్రప్రభ: విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు విద్యాధరపురంలోని షేక్ బాజీ సాహెబ్ మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. పాఠశాలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
మంగళవారం కూటమి నాయకులతో కలిసి పాఠశాలను సందర్శించిన ప్రత్తిపాటి శ్రీధర్, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సయ్యద్ తాహెరా జమీల్ పాఠశాలలో తాగునీటి సౌకర్యం, విద్యుత్ లైన్ల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి వంటి ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి శ్రీధర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, త్వరలో సంబంధిత అధికారులతో సమగ్ర అంచనా నివేదిక రూపొందించి అవసరమైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఏలూరి సాయి శరత్, బొల్లేపల్లి కోటేశ్వరరావు, సుజనా మిత్ర కోఆర్డినేటర్ నర్మద తదితరులు పాల్గొన్నారు.
