రాష్ట్రాల వారీగా వ్యవసాయ రోడ్ మ్యాప్ తయారీ
ఎంపీ మహేష్ యాదవ్
ఏలూరు, ఆంధ్రప్రభ: అనేక రాష్ట్రాల్లో వివిధ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్. దీనిపై మంగళవారం లోక్ సభలో ఏలూరు ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానమిస్తూ, అస్సాం, గోవా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ & నికోబార్ దీవుల రాష్ట్రాల కోసం కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు (రోడ్ మ్యాప్) ప్రారంభించినట్లు తెలిపారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఉత్పాదకత, లాభదాయకత మరియు వనరుల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని వ్యవసాయ రోడ్‌మ్యాప్ తయారు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి, వివిధ పథకాల కింద వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మార్గదర్శక సూత్రాలను సూచనగా తీసుకోవచ్చునని తెలిపారు.
స్థానిక వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు, వాతావరణ మార్పులను తట్టుకునే గుణం , రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ, రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ , అనుబంధ వస్తువులలో స్వయం సమృద్ధిని మెరుగుపరచడం, గ్రామీణ ఉపాధి అవకాశాలను కల్పించడం , వ్యవసాయ రంగం యొక్క సుస్థిర వృద్ధిని నిర్ధారించడం వంటివి వ్యవసాయ రోడ్‌మ్యాప్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కేంద్ర మంత్రి వివరించారు.
ఈ వ్యవసాయ రోడ్‌మ్యాప్‌లను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐ.సి.ఎ.ఆర్), వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, ఐసీఏఆర్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు నిపుణులు సంయుక్తంగా సిద్ధం చేస్తున్నట్లు ఎంపీ మహేష్ యాదవ్ కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వివరించారు.
