ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
- 21వ రోజు 39 సారె బృందాలు
- 16,921 మందితో అమ్మవారికి కానుకలు
- పసుపు, కుంకుమ, చీరలు, గాజులతో ఇలవేల్పుకు హారతులు
- భక్తులతో కలిసి మొక్కులు చెల్లించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఆషాఢ మాస సారె మహోత్సవాలు ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించే మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్నారు. ఆషాఢ సారె ఉత్సవాల్లో 21వ రోజు మంగళవారం ఆలయంలో మహిళా భక్తుల రద్దీ విశేషంగా కనిపించింది.
మంగళవారం మొత్తం 39 సారె బృందాలు అమ్మవారికి సారె సమర్పించగా, ఆయా బృందాలకు చెందిన 16,921 మంది భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, సారె బృందాలకు ఉచిత దర్శనం, ఆశీర్వచనాలు కల్పించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సారె బృందాలతో కలిసి శ్రీ కనకదుర్గమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, ప్రసాదాల పంపిణీ, ఇతర సౌకర్యాలను ఆలయ యంత్రాంగం సమర్థంగా నిర్వహించింది. ఆషాఢ మాస సారె మహోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివస్తుండటంతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది.
