చౌటుప్పల్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
పలు వార్డుల్లో డ్రైనేజీ పనులకు భూమిపూజ..
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని పలు వార్డుల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా 1వ వార్డు (లింగారెడ్డిగూడెం), 3వ వార్డు (లింగోజిగూడెం)లో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు, 19వ వార్డులో చౌటుప్పల్ కాంప్లెక్స్ సమీపంలోని డ్రెయిన్‌పై స్లాబ్ నిర్మాణ పనులకు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, స్థానిక కౌన్సిలర్ల వినతి మేరకు ప్రజా సౌకర్యార్థం ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీపడబోమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు కుశలం రాకేష్ రెడ్డి, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, పిల్లలమర్రి మధుసూదన్, పాక చిరంజీవి, మాజీ సర్పంచ్ ఊదర్ నరసింహ, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, వార్డు అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
