శిథిలావస్థలోని ఇళ్లలో నివసించవద్దు: మున్సిపల్ చైర్మన్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నివసించవద్దని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ప్రజలకు సూచించారు. మంగళవారం 21వ వార్డులో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న ఇళ్లతో పాటు ఖాళీ స్థలాలను తనిఖీ చేసి, వర్షాల కారణంగా పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నీరు నిలిచే ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు పారిశుద్ధ్య చర్యలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి, పులిపాక రాజు, జవాన్ చిన్న తదితరులు పాల్గొన్నారు.
