నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ తో….

నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ తో….

  • గోదావరిఖని బస్టాండ్ లో పోలీసుల విస్తృత తనిఖీలు
  • గంజాయి మత్తుగార్థాల రవాణాపై నిఘా
  • అనుమానితుల వివరాలు సేకరణ

గోదావరిఖని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ బస్టాండ్లో శుక్రవారం రోజున పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ స్లీపర్ డాగ్స్ తో బస్టాండ్ లోని పరిసర ప్రాంతాలను సోదాలు చేశారు. బస్టాండ్లో అనుమానం కలిగిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ వివరాలు సేకరించడంతోపాటు వారి బ్యాగులను తనిఖీలు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, నార్కోటిక్ వింగ్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజ్‌కుమార్ సమన్వయంతో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

కార్గో పార్సిల్ కేంద్రాలు,దుకాణాలు, పాన్ షాపులతో పాటు పలు బస్సుల్లో కూడా తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ గంజాయి సరఫరా, వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని, నార్కోటిక్ స్నిఫర్ డాగ్‌లతో కూడా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.

తనిఖీలలో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్ దగ్గరకు స్నిఫర్ డాగ్ వెళ్లి వాసన చూడడంతో అతడిని తనిఖీ చేయగా, బ్యాగ్‌లో పొగాకు (తంబాకు) ప్యాకెట్ లభించింది.ప్రభుత్వం నిషేధించిన గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా,విక్రయిస్తున్నా ప్రత్యేక శిక్షణ పొందిన ఈ డాగ్ క్షణాల్లో గుర్తించే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి,మత్తు పదార్థాలు, చిన్నపిల్లలకు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు,గుట్కా, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు విక్రయించిన పక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

గంజాయి,మత్తు పదార్థాలు బస్సులు, రైల్వే మార్గాలు, ప్రైవేట్ వాహనాలు, కార్ల ద్వారా తరలిస్తున్నారని తెలిపారు. ప్రయాణికులు బస్సులు,రైళ్లలో ప్రయాణించే సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులతో కనిపించినా,మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ టీమ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది,నార్కోటిక్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.