ఇంద్రకీలాద్రికి సోలార్ శక్తి..
- విద్యుత్ స్వయం సమృద్ధికి మరో ముందడుగు
- పాతపాడు సోలార్ ప్లాంట్ విద్యుదీకరణ విజయవంతం
- రెండు 500 కిలోవాట్ల ప్లాంట్లకు విద్యుత్ అనుసంధానం పూర్తి
- ఏపీ సీపీడీసీఎల్ అధికారుల తనిఖీ పూర్తి
- విద్యుత్ బిల్లుల భారం తగ్గించి దేవస్థానానికి ఆర్థిక ప్రయోజనం
ఇంద్రకీలాద్రి ,ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం విద్యుత్ స్వయం సమృద్ధి లక్ష్యంగా చేపట్టిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తైంది. పాతపాడు గ్రామంలోని దేవస్థాన భూమిలో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గమ్మ సోలార్ విద్యుత్ కేంద్రంలో రెండు 500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లు (మొత్తం ఒక మెగావాట్) విజయవంతంగా విద్యుదీకరణ పూర్తిచేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు.
విద్యుత్ అధికారుల పరిశీలన..
ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) ఉన్నతాధికారులు సోలార్ ప్లాంట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్ అనుసంధాన వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించి విద్యుదీకరణ ప్రక్రియను పూర్తి చేశారు. సోలార్ ఇన్వర్టర్లు, గ్రిడ్ కనెక్షన్ వ్యవస్థలను తనిఖీ చేసిన అనంతరం ప్లాంట్ సజావుగా పనిచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపేందుకు అవసరమైన అత్యంత కీలకమైన ఏబీటీ మీటర్ల ఏర్పాటు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఈవో తెలిపారు.
ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నెట్ మీటరింగ్ విధానంలో ఇంద్రకీలాద్రి అవసరాలకు వినియోగించిన తర్వాత మిగిలిన విద్యుత్‌ను అధికారికంగా గ్రిడ్‌కు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేవస్థానం విద్యుత్ బిల్లులపై గణనీయమైన భారం తగ్గడంతో పాటు ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుందని, పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఇంద్రకీలాద్రి ఆదర్శంగా నిలుస్తుందని ఈవో వి.కె. శీనా నాయక్ పేర్కొన్నారు.
