జర్నలిస్టుల హక్కుల సాధనకు కార్యాచరణ రూపొందించిన టీయూడబ్ల్యూజే–ఐజేయు

ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ల కోసం పోరాటం కొనసాగించాలని తీర్మానం

సంగారెడ్డి, ఆంధ్రప్రభ : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు, యూనియన్ భవనం వంటి ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు నిరంతర పోరాటం కొనసాగించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ నిర్ణయించింది.

సోమవారం సదాశివపేటలో జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ తొలి సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. పైసల్ ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులతో చర్చించారు.

ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, యూనియన్ భవనం కోసం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, నారాయణఖేడ్, జోగిపేట, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో కొత్త కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు హత్నూర్‌లో కూడా కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు మంజూరు చేయాలని, అక్రిడేషన్ కార్డులు అందని జర్నలిస్టులకు వెంటనే కార్డులు ఇవ్వాలని, కేబుల్ టీవీ జర్నలిస్టులకు ఒక యూనిట్ అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. పైసల్ మాట్లాడుతూ, యూనియన్ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని, క్రమశిక్షణతో పనిచేస్తూ ఐక్యతను కాపాడాలని సూచించారు.

జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల సాధనలో రాజీలేని పోరాటమే మార్గమని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం సంఘటిత ఉద్యమాలు అవసరమన్నారు. ఇటీవల నిర్వహించిన జిల్లా మహాసభను విజయవంతం చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. అనిల్‌కుమార్ మాట్లాడుతూ, సంఘం కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి అన్వర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, కోశాధికారి శ్రీధర్ జైన్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌహాన్, ఉపాధ్యక్షుడు నజీర్, కోశాధికారి లక్ష్మణ్, రాష్ట్ర నాయకుడు బాసిత్, ఐజేయు సభ్యుడు సిద్ధన్న పాటిల్, సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రాంతాల జర్నలిస్టులు పాల్గొన్నారు.