సాయం నుంచి స్వాభిమానానికి..

సాయం నుంచి స్వాభిమానానికి..

  • దివ్యాంగులకు ప్రభుత్వం తోడు
  • టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారు ఆత్మన్యూనతా భావానికి లోనుకాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి పేర్కొన్నారు.

తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు మంగళవారం కంది గ్రామంలో నిర్వహించిన బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పైనల్ కార్డ్ ఇంజూరీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి

కంది గ్రామ సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్ మాట్లాడుతూ గ్రామంలోని దివ్యాంగులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.షఫీ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ, తీవ్రమైన వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రత్యేక నెలసరి ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బ్యాటరీ వీల్ చైర్ల పంపిణీ ద్వారా పదిమంది దివ్యాంగులకు చలనం కలగడం సంతోషకరమని అన్నారు..కార్యక్రమంలో ఉపసర్పంచ్ అసద్ ఖాన్, పంచాయతీ సభ్యులు మహ్మద్ గౌస్, ఎండి తయ్యబ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మణ్ గౌడ్, దివ్యాంగుల రాష్ట్ర మహిళా నాయకురాలు జి. ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply