ప్రయాణం మధ్యలో ఊహించని విషాదం..

ప్రయాణం మధ్యలో ఊహించని విషాదం..
- వెల్కటూర్ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
- ఇద్దరు మృతి
సిద్దిపేట అర్బన్, ఆంధ్రప్రభ : సిద్దిపేట జిల్లా వెల్కటూర్ కమాన్ సమీపంలో మంగళవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి ప్రయాణిస్తున్న ఓ కుటుంబం కారు రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో మణుగూరు పట్టణానికి చెందిన కొలిపాక రవిచంద్రనాథ్, ఆయన భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది.

అదే కారులో ప్రయాణిస్తున్న వారి కుమారుడు అజయ్, కోడలు అర్చన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనతో వెల్కటూర్ కమాన్ పరిసర ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

