చెరువులో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్య పరిష్కారం
లైన్‌మ్యాన్ సాహసానికి ప్రశంసలు
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేస్తున్న లక్ష్మణచాంద మండల విద్యుత్ శాఖ సిబ్బంది మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
మండలంలోని బోరిగాం గ్రామ చెరువులో ఉన్న విద్యుత్ స్థంభం వద్ద జంపర్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు లైన్‌మ్యాన్ రాజు సాహసోపేతంగా చెరువు నీటిలో ఈదుకుంటూ స్థంభం వద్దకు చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. అనంతరం జంపర్ లోపాన్ని సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
విద్యుత్ శాఖ ఏఈ మహేష్ పర్యవేక్షణలో సిబ్బంది వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించడంతో గ్రామస్థులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ విధి నిర్వహణలో నిబద్ధత కనబరిచిన విద్యుత్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
