ప్రజల వద్దకే పాలన..

  • పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా
  • ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 220 దరఖాస్తులు
  • అత్యధికంగా భూవివాదాలకు సంబంధించిన అర్జీలు
  • త్వరలో మండల కేంద్రాల్లో అర్జీలు స్వీకరణ

వినుకొండ, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను వేగవంతంగా, పార దర్శకంగా పరిష్కరిస్తూ పాలనను నేరుగా ప్రజల చెంతకే తీసుకు వస్తున్నామని పల్నాడు కలెక్టర్ డాక్టర్ కృత్తికా శుక్లా స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రం వినుకొండలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ప్రజా దర్బార్) కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు శాసనసభ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు,జాయింట్ కలెక్టర్, సంజన సింహా, రెవెన్యూ డివిజన్ అధికారి వివిధ జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి డాక్టర్ కృత్తికా శుక్లా మాట్లాడుతూ, ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” అనే ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రజలు జిల్లా కేంద్రానికి రావలసిన అవసరం లేకుండా, అధికారులందరినీ నేరుగా నియోజకవర్గానికే తీసుకువచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.

ఈ వేదిక ద్వారా వచ్చిన సుమారు 220 దరఖాస్తులలో అత్యధికంగా రెవెన్యూ, భూ పునఃసర్వే, భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయని వెల్లడించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖలకు కేటాయించి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా పేదలు ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతాలు, ప్రభుత్వ నివాస ప్రాంతాలలో (కాలనీల్లో) ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బొల్లాపల్లి, శవల్యాపురం మండలాల నుంచి ఒకే అంశంపై పదేపదే ఫిర్యాదులు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా పాలనాధికారి, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను హెచ్చరించారు.

రాబోయే మూడు వారాల్లో నూజెండ్ల, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు మండలాల్లో పర్యటించి స్థానికంగానే అర్జీలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆగ్రహారం గ్రామాల్లో భూ పునఃసర్వే కారణంగా నిలిచిపోయిన ఏడు గ్రామాల భూ సమస్యలను వచ్చే మార్చి నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించి అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొచ్చెర్ల భూ సమస్యలు, అంగన్‌వాడీ భవనాలు, పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖ రహదారులు, వంతెనల నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో ఆమోదిస్తామని చెప్పారు. వినుకొండ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత తీర్చేందుకు కొత్త నియామకాలతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన (డెప్యుటేషన్‌పై) వైద్యులను నియమిస్తామని భరోసా ఇచ్చారు.

ప్రజా సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించాలి : ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా, సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సూచించారు. ప్రస్తుతం ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలో 34వ స్థానంలో ఉందని, అధికారులు మరింత అంకితభావంతో పనిచేసి వినుకొండను రాష్ట్రంలోనే మొదటి ఐదు స్థానాల్లో నిలిపేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ప్రజా దర్బార్‌లో ప్రస్తావనకు వచ్చిన ఆగ్రహారం భూముల సమస్యను జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపిన జీవీ ఆంజనేయులు, ఈ సమస్యను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరించి అర్హులైన బాధితులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా నమోదవుతున్న ఫిర్యాదుల నివేదికలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తున్నాయని తెలిపారు. సమస్యలు పరిష్కారమైన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ప్రజలకు నేరుగా ఫోన్ ద్వారా సమాచారం అందించి అభిప్రాయం తెలుసుకుంటున్నారని, ప్రస్తుతం సుమారు 80 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో వినుకొండ ఆదర్శ నియోజకవర్గంగా నిలవాలని ఆకాంక్షించారు. అధికారుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన జీవీ ఆంజనేయులు, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అధికారులు ప్రజల సేవకులనే విషయాన్ని గుర్తుంచుకుని, తమ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ గౌరవంతో ఆదరించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ ఫిర్యాదులు వచ్చే పరిస్థితి ఉండకూడదని, ప్రజల పట్ల సానుకూలంగా స్పందించినప్పుడే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.