విస్తరణ దిశగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌

విస్తరణ దిశగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌

-విజయవాడలో రైల్వే హాస్పిటల్, ఆర్‌ఆర్‌బీ ఏర్పాటుకు విజ్ఞప్తి
-ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమంపై ప్రధాన డిమాండ్లు..
-నూతన జోన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే రంగంలో కొత్త దిశ..
-ఎంపీ కేసినేని చిన్నితో మజ్దూర్ యూనియన్ నాయకుల భేటీ

ఆంధ్రప్రభ, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రంగ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు కీలక అడుగు వేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజనల్ సెక్రటరీ లీల, హింద్ మజ్దూర్ సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఎన్. శ్రీనివాసరావు శుక్రవారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతం చేయడం, జోన్ అమలుకు సంబంధించి ముందడుగులు వేయడం పట్ల రైల్వే కార్మికుల తరఫున ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో నూతన జోన్ పరిధిలో విజయవాడకు మరింత ప్రాధాన్యం కల్పించేలా పలు అభ్యర్థనలు ఉంచారు. ముఖ్యంగా విజయవాడలో సెంట్రల్ రైల్వే హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, గుంతకల్, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది అత్యవసరమని వివరించారు. అదేవిధంగా రైల్వే ఉద్యోగులకు మంగళగిరి ఎయిమ్స్ లో రైల్వే రిఫరల్ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ యువతకు రైల్వే రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే విజయవాడలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు అవసరమని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. అలాగే నూతన సౌత్ కోస్ట్ జోన్ పరిధిలో అన్ని విభాగాలకు సంబంధించిన జోనల్ ట్రైనింగ్ సెంటర్లు కూడా విజయవాడలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాజధాని అమరావతి అభివృద్ధి, రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలపై సమగ్ర దృష్టితో చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీకి మెమొరాండం అందజేశారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమం, వైద్య సేవలు, ఉపాధి అవకాశాలు, శిక్షణా సదుపాయాల కల్పన వంటి అంశాలు నూతన జోన్ ఏర్పాటుతో మరింత వేగం అందుకుంటాయని కార్మిక సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply