అప్రకటిత విద్యుత్ కోతలపై వైసీపీ ఆగ్రహం

అప్రకటిత విద్యుత్ కోతలపై వైసీపీ ఆగ్రహం

విజయవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు, విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.

నగరంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అప్రకటిత కరెంట్ కోతలను నిలిపివేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యుత్ కోతలు లేవని చెబుతున్నప్పటికీ, గంటల తరబడి సరఫరా నిలిపివేస్తున్నారని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, విజయవాడ నగర ప్రజలు తీవ్రమైన విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన గాలివాన సమయంలో విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు.

విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.

ఫుడ్ కోర్టుల వద్ద జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు దందా నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వల్ప గాలివానకే విజయవాడ అతలాకుతలం కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హోంగార్డు జానీ, ఈట్ స్ట్రీట్ వద్ద మృతిచెందిన సూర్యప్రకాశ్ మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. హోంగార్డు జానీ కుటుంబానికి, సూర్యప్రకాశ్ కుటుంబానికి తలో రూ.50 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజల ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించడం లేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

ఈట్ స్ట్రీట్ వద్ద జనరేటర్ల దందా జరుగుతోందని దేవినేని అవినాష్ ఆరోపించారు. అక్కడ మృతిచెందిన సూర్యప్రకాశ్ కుటుంబానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హోంగార్డు జానీ, సూర్యప్రకాశ్ కుటుంబాలకు తక్షణమే రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.

Leave a Reply