గ్రామాల అభివృద్ధి నిధుల కేటాయింపుపై వివక్ష ఆరోపణలు
ప్రతిపక్ష, రెబల్ సర్పంచ్‌ల గ్రామాలకు తగిన ప్రాధాన్యం లేదంటూ విమర్శలు
తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ: పాలకుర్తి నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చోటుచేసుకుంటోందంటూ ప్రతిపక్ష నాయకులు, కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు అభివృద్ధి పనులు మంజూరు అవుతుండగా, బీఆర్ఎస్, రెబల్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని విమర్శిస్తున్నారు.
తొర్రూరు మండలంలో మొత్తం 31 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది, బీఆర్ఎస్‌కు చెందిన 9 మంది, రెబల్‌గా ఎన్నికైన ముగ్గురు సర్పంచ్‌లు ఉన్నారు. కాంగ్రెస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతున్నప్పటికీ, బీఆర్ఎస్, రెబల్ సర్పంచ్‌ల గ్రామాల్లో నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా గ్రామ అభివృద్ధి విషయంలో సమానత్వం పాటించాలని స్థానికులు కోరుతున్నారు.
గత నెల 27న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి హరిపిరాల, దుబ్బతండ, ఫత్తేపురం, పోలెపల్లి, కర్కాల, నాంచారిమడూరు, గోపాలగిరి, సోమారం, ఖానాపురం, అమర్‌సింగ్ తండా, గుర్తూరు, చికటాయపాలెం, ఎస్‌వీకే తండా, వెంకటాపురం, గుడిబండ తండా, హచ్చుతండ, జీకే తండా, కొమ్మనపెల్లి తండా, పెద్ద మంగ్యతండ, ఈదులకుంట తండా, కిష్టాపురం, వెలికట్టె, చింతలపెల్లి గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు సుమారు రూ.5.70 కోట్లతో శంకుస్థాపనలు చేశారు.
అయితే మండలంలోని పెద్ద గ్రామాలైన అరిపిరాల, కంఠాయపాలెం, మాటేడు, చింతలపల్లి, వెలికట్టె వంటి గ్రామాలకు నామమాత్రపు నిధులే కేటాయించారని, అమ్మాపురం గ్రామానికి మాత్రం ఎలాంటి అభివృద్ధి నిధులు మంజూరు కాలేదని ఆరోపణలు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు గడిచినా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ప్రజలు రాజకీయాలను కాకుండా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేశారని, అధికార–ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని గ్రామాలకు సమాన ప్రాధాన్యంతో నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అభివృద్ధి నిధుల కేటాయింపుపై వస్తున్న విమర్శలు పాలకుర్తి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ అనుబంధాల ఆధారంగా కాకుండా ప్రజల అవసరాలు, గ్రామాల అభివృద్ధి ప్రాధాన్యతల ఆధారంగా నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు పారదర్శక విధానంలో నిధుల కేటాయింపు చేపట్టి అన్ని గ్రామాలకు సమాన న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
