ఎల్కతుర్తిలో శాశ్వత బతుకమ్మ వేదిక ఏర్పాటు చేయాలి
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ఎల్కతుర్తి మండల కేంద్రంలో శాశ్వత వేదిక ఏర్పాటు చేయాలని గ్రామ మహిళలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బతుకమ్మ పండుగకు ఇంకా మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అధికారులు స్పందించి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎల్కతుర్తిలో మహిళలందరూ ఒకేచోట చేరి బతుకమ్మ ఆడుకునేందుకు విశాలమైన, శాశ్వత ప్రదేశం లేకపోవడంతో ప్రతి ఏడాది ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బ్యాంకు సమీపంలో, సీఐ కార్యాలయం ఎదుట, మరికొన్ని సందర్భాల్లో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఖాళీ ప్రదేశాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఏటా స్థలం మారుస్తూ పండుగ జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
చెరువు పక్కన ప్రభుత్వ భూమి..
ఎల్కతుర్తి చెరువు సమీపంలో ప్రభుత్వానికి చెందిన సుమారు ఐదు ఎకరాల భూమి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూమిలో కొంత భాగాన్ని ఓ భూస్వామి సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ప్రభుత్వ భూమిపై సమగ్ర పరిశీలన జరిపి, ప్రజల అవసరాలకు అనువైన స్థలాన్ని కేటాయిస్తే అక్కడ శాశ్వత బతుకమ్మ వేదికను అభివృద్ధి చేయవచ్చని మహిళలు సూచించారు.
చెరువు పక్కనే విశాలమైన ప్రదేశం ఉండటంతో బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనే పండుగ కావడంతో సురక్షితమైన స్థలం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
20 ఏళ్లుగా ఇదే సమస్య..
దాదాపు 20 ఏళ్లుగా బతుకమ్మ వేడుకల నిర్వహణకు శాశ్వత స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు తెలిపారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖలు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రానున్న బతుకమ్మ పండుగ నాటికైనా ఎల్కతుర్తి మహిళలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తగిన గౌరవం కల్పించాలని గ్రామ మహిళలు, ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
