రాష్ట్ర అధికారిక వేడుకగా కాకాని జయంతి నిర్వహించాలి
- కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కాకాని తరుణ్
- ఘనంగా కాకాని వెంకటరత్నం జయంతి వేడుకలు
- వీధి వ్యాపారిణికి జ్యూస్ బండి..
- పేదలు–ఆటో డ్రైవర్లకు పండ్ల పంపిణీ
- ‘కాకాని సర్కిల్’గా పేరు మార్చాలని ప్రభుత్వానికి వినతి
- అమరావతిలో కాకాని వెంకటరత్నం విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
- కాకాని ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన అవసరం ఉందన్న తరుణ్
(విజయవాడ, ఆంధ్రప్రభ) : స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం జయంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని, విజయవాడ బెంచ్ సర్కిల్‌కు కాకాని సర్కిల్”గా పేరు మార్చాలని కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కాకాని తరుణ్ ప్రభుత్వాన్ని కోరారు. బెంచ్ సర్కిల్‌లో సోమవారం నిర్వహించిన కాకాని వెంకటరత్నం జయంతి వేడుకల్లో ఈ మేరకు వినతిపత్రాన్ని 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్‌కు అందజేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్‌లో సోమవారం కాకాని వెంకటరత్నం 126వ జయంతి, డాక్టర్ కాకాని తరుణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా, ఆంధ్ర క్రికెట్ అకాడమీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దొడ్డపనేని గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీధి వ్యాపారిణి లక్ష్మమ్మకు ఉక్కుతో తయారు చేసిన పండ్లరసం బండిని బహుకరించారు. అలాగే వంద మందికి పైగా పేదలు, ఆటో డ్రైవర్లకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాకాని తరుణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడు, జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం ఆశయాలను నేటి తరానికి, రాజకీయ నాయకులకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 3న కాకాని వెంకటరత్నం జయంతిని అధికారికంగా నిర్వహించాలని, బెంచ్ సర్కిల్‌కు కాకాని సర్కిల్”గా పేరు మార్చాలని, అమరావతిలో కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కాకాని తరుణ్, ఎన్.జి. రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్, కృష్ణా జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు జస్తి సతీష్, గుమ్మడి రామకృష్ణ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం లంకా దినకర్‌కు వినతిపత్రం అందజేసింది.
ముఖ్య అతిథి లంకా దినకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐరన్ మ్యాన్ ఏపీ కురియన్ గా పేరొందిన కాకాని వెంకటరత్నం సేవలను కొనియాడారు. ఆయన వారసత్వాన్ని సమాజానికి పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ కాకాని తరుణ్ సేవలను అభినందించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, కాకాని ఆశయ సాధన సమితి సభ్యులు పాల్గొని కాకాని వెంకటరత్నంకు ఘన నివాళులర్పించారు.
