Stock market | మదుపర్లకు రూ.5లక్షల కోట్ల లాభం…

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..


Stock market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలు జరపనున్నట్లు ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాల్లోనే ముగిశాయి.

ఉదయం 78,883.34 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ రోజంతా సానుకూల ధోరణిలో కదిలింది. ఇంట్రాడేలో 78,895.10 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 544.39 పాయింట్లు లాభపడి 78,639.03 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 390.70 పాయింట్లు ఎగిసి 24,774.30 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క సెషన్‌లోనే మదుపర్ల సంపద సుమారు రూ.5 లక్షల కోట్లు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.31 వద్ద కొనసాగింది.

సెన్సెక్స్‌లో ఇండిగో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో నిలవగా.. సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 83.83 డాలర్లు, బంగారం ఔన్స్ ధర 4,054.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.