ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండ – గౌరు చరితారెడ్డి
- పాణ్యంలో 45 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
- రూ.30.61 లక్షల ఆర్థిక సాయం అందజేత
- సీఎం చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమానికి పెద్దపీట అని వెల్లడి
నంద్యాల జిల్లా, ఆంధ్రప్రభ: పాణ్యం నియోజకవర్గానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా మంజూరైన రూ.30,61,789 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
అవసరమైన సమయంలో అందుతున్న ఈ ఆర్థిక సాయం అనేక కుటుంబాలకు భరోసాను కల్పిస్తోందని, వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని గౌరు చరితారెడ్డి తెలిపారు.
