మాదాల రంగారావు ఆశయాలను కొనసాగిద్దాం

మాదాల రంగారావు ఆశయాలను కొనసాగిద్దాం

మాదాల రంగారావు 8వ వర్ధంతి సభలో సిపిఐ నేతల పిలుపు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా కళాకారుడు, విప్లవ నటుడు మాదాల రంగారావు ఆశయాలను యువత కొనసాగించేలా అందరూ చైతన్యంతో ముందుకు సాగాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్ పిలుపునిచ్చారు.

బుధవారం సమితి ఆధ్వర్యంలో మాదాల రంగారావు 8వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వక్తలు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదాల రంగారావు తెలుగు సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. వామపక్ష భావజాలంతో అవినీతి, అణచివేత వంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారని పేర్కొన్నారు. ఆయన నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించినట్లు గుర్తు చేశారు.

మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి చిత్రాల్లో ఆయన నటించారని తెలిపారు.

మాదాల రంగారావు చిత్రాల్లోని నాంపల్లి స్టేషన్ కాడా రాజా లింగో, కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడా, అమరవీరులెందరో వంటి పాటలు ప్రజాదరణ పొందాయని పేర్కొన్నారు. 1980–90 దశకంలో ఆయన సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించారని తెలిపారు.

వామపక్ష సిద్ధాంతాలకు బలంగా నిలిచిన ఆయన, తాను నిర్మించిన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని ప్రజా ఉద్యమాలకు, ప్రజల కోసం విరాళంగా ఇచ్చేవారని వక్తలు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మురళీధర్, నాగరాముడు, రియాజ్, శ్రీనివాసులు, ధనుంజయ్, సుశీలమ్మ, సరోజమ్మ, రవి, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply