నకిలీ ధ్రువపత్రాల ముఠా గుట్టురట్టు
ఐదుగురు అరెస్ట్..
మరో నిందితుడి కోసం గాలింపు
ఇచ్చోడ, ఆంధ్రప్రభ: ప్రభుత్వ రికార్డులను నకిలీగా సృష్టించి ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ముఠాను గుర్తించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
గుండాల గ్రామపంచాయతీ కార్యదర్శి మహ్మద్ లుక్మాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు గ్రామపంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ రబ్బర్ స్టాంపు తయారు చేసి, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలు, ఇంటి పన్ను ధ్రువపత్రాలు తదితర పత్రాలను కంప్యూటర్ల ద్వారా తయారు చేసినట్లు గుర్తించారు.
ఈ నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు, పాన్ కార్డులు పొందేలా చేసి, అనర్హులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కల్పించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో పాటు ఇతర నిందితుల పాత్రను వెల్లడించాడు. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ సీపీయూలు, మానిటర్లు, ప్రింటర్లు, హార్డ్‌డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు, సుప్రీమారియల్ స్కాన్-జీ10 ఫింగర్‌ప్రింట్ స్కానర్, సీఎంఐ టెక్ కెమెరా, లాజిటెక్ వెబ్ కెమెరా తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి వాటిలోని ఆధారాలను సేకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు ఎంతమంది పేర్లతో నకిలీ పత్రాలు రూపొందించారు, వాటిని ఎవరెవరు ఉపయోగించారు, ఈ కుట్రలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
అరెస్టైన నిందితులు:
- షేక్ హరూన్ (కేశవపట్నం గ్రామం)
- అబ్దుల్ షఫీక్ (31), ఇస్లాంపురా కాలనీ, ఇచ్చోడ
- షేక్ దిల్‌షాద్ అహ్మద్ (19), ఇస్లాంపురా కాలనీ, ఇచ్చోడ
- అబ్దుల్ రహమాన్ ఖాన్ (20), హనుమాన్ కాలనీ, ఇచ్చోడ
- సయ్యద్ నౌషాద్ (26), ఇస్లాంపురా, ఇచ్చోడ
పరారీలో ఉన్న నిందితుడు:
- అబ్రార్ అలీ
నిందితులపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 318(4), 338, 340, 341(2)తో పాటు 3(5), ఐటీ చట్టం సెక్షన్ 66-డి, ఆధార్ చట్టం-2016 సెక్షన్ 35 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే (ఐపీఎస్), ఇచ్చోడ ఎస్‌హెచ్‌వో ఇన్‌స్పెక్టర్ కె. నరేష్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
