సాగునీటి కోసం రోడ్డెక్కిన కృష్ణా డెల్టా రైతులు..
ఏలూరు కలెక్టరేట్ ముట్టడి
కృష్ణా డెల్టాకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్
పట్టిసీమ–పొణంగి పుంత కాలువ ద్వారా ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు మళ్లించాలని విజ్ఞప్తి
సాగునీరు ఇవ్వకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రైతుల హెచ్చరిక
ఏలూరు, ఆగస్టు 3 (ఆంధ్రప్రభ) : కృష్ణా డెల్టాకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కృష్ణా డెల్టా రైతులు ఏలూరు కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం సాగునీటి సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రైతులు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం రైతు సంఘం ప్రతినిధులు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతిపత్రం సమర్పించి సాగునీటి సమస్యపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ…. కృష్ణా డెల్టాకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గోదావరి జలాలను అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం, జలవనరుల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఏలూరు రూరల్ మండలంలోని సుమారు 10 వేల ఎకరాలకు పొణంగి పుంత కాలువ ద్వారా సాగునీరు అందించే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
గోదావరి మెయిన్ కెనాల్ ఆధునీకరణ పనులను నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండగా, గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా రైతులకు మాత్రం సాగునీరు అందించడం లేదని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు.
జూన్ 15 నుంచి సాగునీరు ఇస్తామని ప్రకటించి, రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ‘సూపర్ ఎల్ నినో’ పేరుతో వరి సాగు చేయొద్దని చెప్పడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇప్పటికే నారుమళ్లు వేసి, నాట్లు ప్రారంభించిన రైతులు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టారని, వారిలో అధికశాతం కౌలు రైతులేనని తెలిపారు.
పట్టిసీమ కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని మళ్లించి ఖరీఫ్ వరి పంటను కాపాడాలని, తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులకు కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కృష్ణా డెల్టా రైతులు వాడవల్లి రామారావు, దాసరి హనుమంతరావు, బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ… సాగునీరు లేకపోతే వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పశుపోషణ కూడా భారంగా మారిందని పేర్కొన్నారు.
తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు మలకలపల్లి నాగు, దాసరి సతీష్ మాట్లాడుతూ… శివారు ప్రాంతాలకు సాగునీరు సరిగా చేరక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటి విడుదల చేపట్టాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి కృష్ణా డెల్టా రైతులను ఆదుకోవాలని కోరారు.
అనంతరం రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతిపత్రం అందజేశారు. సాగునీటి సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు, తాడిపూడి ఎత్తిపోతల రైతులు, ఏలూరు, దెందులూరు, పెదపాడు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల మండలాలకు చెందిన పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
