శైవక్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు

(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి) : కృష్ణా జిల్లా వ్యాప్తంగా కార్తీక సోమవారం శోభ సంతరించుకుంది. పట్టణంలోని శైవ క్షేత్రాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. గుడివాడలో ప్రసిద్ధిగాంచిన భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, గౌరీ శంకర స్వామి దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు క్యూలో బారులు తీరారు. ఆలయాల ప్రాంగణాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీప పూజలు నిర్వహించారు. స్వామివారికి వేద పండితులు విశేష అభిషేక పూజలు చేశారు. ఆలయాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

ఈనెల 5వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు, జ్వాలాతోరణ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉన్న రామలింగేశ్వర స్వామిని, అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం నడకుదురు గ్రామంలోని పృద్వీశ్వర స్వామిని, ఘంటసాల గ్రామంలోని జలదీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద సముద్ర స్థానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కోడూరు మండలంలోని హంసలదీవి బీచ్ వద్ద పుణ్య స్థానాలు ఆచరించి శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. పామర్రు నియోజకవర్గం ఐలూరులో ఉన్న కృష్ణానదిలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. పెడన నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు నిర్వహించడం జరిగింది.
