ప్రతి శిశువుకు తొలి ఆహారం తల్లిపాలే
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలే పునాది: కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత విలువైన తొలి ఆహారమని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువుకు అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించే పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాల్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిశువు జన్మించిన వెంటనే వచ్చే ముర్రుపాలను (కొలస్ట్రం) తప్పనిసరిగా అందించాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు.
తొలి ఆరు నెలల పాటు శిశువుకు పూర్తిగా తల్లిపాలే అందించాలని, దీంతో శారీరక, మానసిక వికాసం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తల్లి-శిశువు మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడంలో కూడా తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి, దీనిపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, సంగారెడ్డి ఆర్డీవో గున్నాల రాజేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
