ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు

ప్రభుత్వ పథకాలు, వ్యాపార అవకాశాలపై సమగ్ర మార్గదర్శనం

మెదక్, ఆంధ్రప్రభ : ఎస్సీ, ఎస్టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, వారికి ప్రభుత్వ పథకాలు, వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఎస్సీ-ఎస్టీ కేంద్రం, డిక్కీ తెలంగాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల అవగాహన, ప్రత్యేక విక్రేతల అభివృద్ధి సదస్సు శనివారం మెదక్ పట్టణంలో నిర్వహించారు.

డిక్కీ మెదక్ జిల్లా సమన్వయకర్త ఎం. దుర్గాప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. జాతీయ ఎస్సీ-ఎస్టీ కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభాగాధిపతి ఎస్. సురేష్ సదస్సు ఉద్దేశాలను వివరించారు.

అనంతరం డిక్కీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జె. సీతారాం, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (ఎన్‌ఎస్‌ఐసీ) తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ ప్రధాన నిర్వాహకుడు వి. సురేష్‌బాబు పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు.

ఎన్టీపీసీ రామగుండం సీనియర్ మేనేజర్ అమన్ పాండే, జిల్లా పరిశ్రమల కేంద్రం మెదక్ జనరల్ మేనేజర్ యాదగిరి, ఎన్‌ఎండీసీ ఉప ప్రధాన నిర్వాహకుడు (మెటీరియల్స్) కె. హరికృష్ణన్, కేంద్ర గిడ్డంగుల సంస్థ మేనేజర్ లంబ భగ్యరాజు, వాణిజ్య బిల్లుల డిజిటల్ చెల్లింపు వేదిక (ట్రెడ్స్) ప్రతినిధి మహేష్ పన్వార్ పాల్గొని వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యాపార అవకాశాలు, విక్రేతల అభివృద్ధిపై అవగాహన కల్పించారు.

సదస్సులో జిల్లాకు చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక రంగంలో ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు.