కేరళ మాజీ సీఎంపై ఈడీ దాడులకు నిరసన

కేరళ మాజీ సీఎంపై ఈడీ దాడులకు నిరసన
ప్రజా ఉద్యమాల ద్వారానే మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: కె.రాజయ్య
సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నివాసంపై ఈడీ నిర్వహించిన దాడులను ఖండిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె. రాజయ్య మాట్లాడుతూ, ఈడీ దాడులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించారు. కేరళలో పదేళ్లపాటు ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేసిన వామపక్ష ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టిందని విమర్శించారు.
ప్రతిపక్షాల గొంతును నొక్కివేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సీపీఎంను బలహీనపరిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
ప్రశ్నించే స్వరాలను అణచివేయాలనే ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్న ఆయన, సీపీఎంను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు.
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థలను ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఈడీ స్వతంత్రంగా వ్యవహరించాలని కోరారు. ప్రజా ఉద్యమాల ద్వారానే కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు తగిన సమాధానం చెబుతామని రాజయ్య స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు భాస్కర్ రెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్, ముత్యాలు, గొట్టయ్య, నవీన్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
