కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 181 అర్జీలు..

నరసరావుపేట, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉండేలా అధికారులు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) అద్దయ్య ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఆయన స్వీకరించి, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు సూచించారు.

ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో అధికారులను ఆశ్రయిస్తారని, వారి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని సూచించారు.

ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అర్జీలు ఎస్‌ఎల్‌ఏ (SLA) గడువును దాటకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, పరిష్కారం సాధ్యం కాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు.

అర్జీల పరిష్కారంలో జిల్లాల వారీగా జరుగుతున్న పనితీరును అధికారులు నిరంతరం సమీక్షించుకోవాలని, పల్నాడు జిల్లా పనితీరు మెరుగ్గా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను శాఖల వారీగా సమీక్షించి, వాటి పరిష్కారానికి చర్యలను వేగవంతం చేయాలన్నారు.

ప్రజలకు ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా ఉండాలని డీఆర్వో స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 181 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌కు 36 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో గురజాల నుంచి 12, సత్తెనపల్లి నుంచి 11, నరసరావుపేట నుంచి 13 దరఖాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పులిచింతల డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్, డీఎల్‌డీఓ గబ్రు నాయక్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.