కూల్చివేతలతో ఉద్రిక్తత

పోలీసు బందోబస్తులో కూల్చివేతలు
ఇళ్ల కూల్చివేతలపై నిరసనలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని గాజులరామారం ప్రాంతంలో సోమవారం రెవెన్యూ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పారిశ్రామిక షెడ్లు, దుకాణాలు, పలు నిర్మాణాలను అధికారులు జేసీబీలతో కూల్చివేయగా, బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాము 45 నుంచి 50 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నామని, తమ వద్ద భూ పత్రాలు ఉన్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఇళ్లను కూల్చివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతమంది మహిళలు తాము వేడుకున్నా అధికారులు వినలేదని, పోలీసులు తమతో కఠినంగా వ్యవహరించారని ఆరోపించారు. తాము గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నామని చెప్పినా కనికరం చూపలేదని ఓ బాధితురాలు వాపోయింది.

కూల్చివేతల కారణంగా జీవనాధారం కోల్పోయామని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు.