ప్రజాకవి అందెశ్రీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: “జయ జయహే తెలంగాణ” గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి తన కలాన్ని జెండాగా మలిచి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహోన్నత వ్యక్తిగా అందెశ్రీని కొనియాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విడుదల చేసిన సందేశంలో, తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్ఫూర్తిని తన అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని పేర్కొన్నారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని తెలిపారు.
అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తినిచ్చే మార్గదర్శిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన అంకితభావం, ప్రజల పట్ల నిబద్ధత, సమాజానికి అందించిన సాహిత్య సంపద చిరకాలం ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ పేరు, ఆయన రచనలు, ఆయన ప్రబోధించిన ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, భావితరాలను చైతన్యపరుస్తూనే ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.
