రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

డిజిటల్ సేవలు మరింత బలోపేతం
టీ-ఫైబర్ పనులు వేగవంతం చేయాలి
ప్రపంచ బ్యాంక్‌తో కీలక భేటీ
డిజిటల్ తెలంగాణపై దృష్టి
రూ.2,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా – వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటు, కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్ సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు. ప్రజా సేవల నాణ్యత మెరుగుదల, డేటా గవర్నెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో ప్రపంచ బ్యాంక్ అందించగల సాంకేతిక సహకారం, జ్ఞాన భాగస్వామ్యం, అంతర్జాతీయ ఉత్తమ విధానాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

దేశంలో డిజిటల్ పెట్టుబడులకు తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.

టీ-ఫైబర్ పనులు వేగవంతం చేయాలి

సమావేశం అనంతరం టీ-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, సేవల విస్తరణపై అధికారులతో సమీక్షించారు.

టీ-ఫైబర్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను వెంటనే పరిష్కరించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దూరిశెట్టి, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, టీ-ఫైబర్ ఎండీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.