పుష్ప పల్లకీపై భక్తులకు కనువిందు చేసిన శ్రీ మలయప్పస్వామి
- ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమల పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు
- తొమ్మిది రకాల సంప్రదాయ పుష్పాలు, ఐదు రకాల కట్ ఫ్లవర్స్‌తో అద్భుత అలంకరణ
తిరుమల, ఆంధ్రప్రభ : ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమలలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అత్యంత వైభవంగా అలంకరించిన పుష్ప పల్లకిపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన పల్లకిపై ఊరేగిన ఉత్సవమూర్తులను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
టీటీడీ ఉద్యానవన విభాగం ప్రత్యేకంగా రూపొందించిన పుష్ప పల్లకిని సంప్రదాయ, అలంకార పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. రోజాలు, చామంతులు, లిల్లీలు, మొగలి పూలు, మల్లెలు, కనకాంబరాలు, తామరపూలు, వృక్షి తదితర తొమ్మిది రకాల సంప్రదాయ పుష్పాలతో పాటు ఐదు రకాల కట్ ఫ్లవర్స్‌ను వినియోగించి పల్లకిని విశేషంగా అలంకరించారు.
అంతేకాకుండా వివిధ రకాల పుష్పాలతో పల్లకికి ప్రత్యేక శోభను తీసుకువచ్చేలా కళాత్మక అలంకరణలు చేశారు. ఈ దివ్యోత్సవాన్ని తిలకించిన భక్తులు గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






