Petrol Price Hike | వాహనదారులకు షాక్..

Petrol Price Hike | వాహనదారులకు షాక్..
Petrol Price Hike | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, రవాణా వ్యయాలు అధికమవడం వంటి కారణాలతో ఇంధన ధరలను పెంచినట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరల భారం మోస్తున్న సామాన్య ప్రజల పై మరింత ఆర్థిక భారం పడనుంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆటో, క్యాబ్, లారీ, బస్సు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కొంతకాలం స్థిరంగా కొనసాగిన ఇంధన ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, ఉద్యోగులు, చిన్న వ్యాపారుల పై ఈ పెంపు ప్రభావం చూపనుంది.
గత పది రోజుల్లోనే ఇంధన ధరలు పెంచడం ఇది మూడోసారి. ఇంధన ధరల పెంపు పై కేంద్ర ప్రభుత్వం స్పందించాలంటూ పలువురు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు అంతర్జాతీయ పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
