న్యాయవాది హత్యకు నిరసనగా మక్తల్ కోర్టులో లాయర్ల విధుల బహిష్కరణ

దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

మక్తల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిలో న్యాయవాది మల్లయ్య హత్యకు నిరసనగా నారాయణపేట జిల్లా మక్తల్ కోర్టులో సోమవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, పెంట్లవెల్లిలో న్యాయవాది మల్లయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన రక్షణ చర్యలు అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రంకుల ఆనంద్, సూర్యప్రకాశ్, జి. సురేందర్, వెంకటేష్ గౌడ్, ఎస్. శివకుమార్, సురేందర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.