యూరియా ఆన్లైన్ యాప్ను రద్దు చేయాలి
రైతు వేదిక క్లస్టర్ పరిధిలోనే ఎరువుల కేటాయింపు చేయాలని ఆప్ డిమాండ్
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా ఆన్లైన్ యాప్ను వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దంకి రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా యాప్ విధానాన్ని సవరించాలని, అలాగే రైతు వేదిక (క్లస్టర్) పరిధిలోని ఎరువుల దుకాణాలకు మాత్రమే ఆన్లైన్ కేటాయింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం యూరియా బస్తాలను ఆన్లైన్లో కేటాయించడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు అన్ని ఎరువుల బస్తాలను కూడా ఆన్లైన్ విధానంలోకి తీసుకురావడం మరింత భారంగా మారిందని అన్నారు.
ఒక మండల పరిధిలోని వేరే గ్రామంలోని దుకాణానికి ఎరువుల కేటాయింపు జరిగితే, ఒక్కో బస్తాకు సుమారు రూ.100 వరకు రవాణా ఖర్చు అవుతోందని తెలిపారు. దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు.
మండలం మొత్తం కాకుండా రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని ఎరువుల దుకాణాలకు మాత్రమే ఆన్లైన్ కేటాయింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా ఉపాధ్యక్షులు భాష పాక శ్రీనివాస్, వెంకన్న, సాయి పాల్గొన్నారు.
