Congress Tribute : రాజీవ్ దార్శనికతే Andhra Prabha News
Congress Tribute : రాజీవ్ దార్శనికతే Andhra Prabha News
- ఆధునిక భారతం పునాది…
- ఆయన సంస్కరణల సృష్టికర్త
- ఐటీ, టెలికం విప్లవాలకు ఆద్యుడు
- దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిన మహానేత
- రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ ఘన నివాళి
- ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిలా

( విజయవాడ,ఆంధ్రప్రభ )
Congress Tribute : మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనిక నాయకుడిగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని ఏపీసీసీ చీఫ్ వై వైస్ షర్మిల పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై నేడు భారత్ అగ్రగామిగా ఎదగడానికి రాజీవ్ గాంధీ అమలు చేసిన సంస్కరణలే ప్రధాన కారణమని ఆమె తెలిపారు. విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక రంగాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు దేశ ప్రగతికి మూలస్తంభాలుగా నిలిచాయని పేర్కొన్నారు. ఐటీ రంగానికి పునాది వేసి, టెలికమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన నాయకుడిగా రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దూరదృష్టి నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారని షర్మిలా వ్యాఖ్యానించారు. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కీలక అడుగులు వేసిన మహానేత అని పేర్కొన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యాన్ని పెంచారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలు నేటికీ ఆదర్శప్రాయమని, ఆధునిక భారత నిర్మాణంలో ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని షర్మిలా స్పష్టం చేశారు.
