రైతుల సమస్యలు పరిష్కరించకపోతే జాతీయ రహదారి దిగ్బంధం

రైతుల సమస్యలు పరిష్కరించకపోతే జాతీయ రహదారి దిగ్బంధం

కూసుకుంట్ల

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల అన్నదాతలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.ఆదివారం ఆయన చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, చౌటుప్పల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎల్లంబావి ఐకేపీ కేంద్రంలో ధాన్యం నిల్వలు, తూకం ప్రక్రియ, రవాణా ఏర్పాట్లను పరిశీలించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రైతులతో మాట్లాడారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు రోజుల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను తక్షణమే పరిష్కరించి, రాబోయే ఐదు రోజుల్లోగా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి జాతీయ రహదారిపై భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

చౌటుప్పల్ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన ఆయన, నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సహకారంతో ఈ ఆసుపత్రిని మంజూరు చేయించి, 60 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు.

గత రెండున్నరేళ్లుగా నిధుల కొరత, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. రాజకీయం పక్కన పెట్టి బిల్లులు విడుదల చేసి, ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రజల అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ సంక్షేమం లక్ష్యంగా పనిచేసి, 100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతం అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఈ పర్యటనలో చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గిర్కటి నిరంజన్ గౌడ్, ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్, సర్పంచ్ రామలింగేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, ఆల్మాస్‌పేట కిష్టయ్య, బీఆర్ఎస్ నాయకులు కొత్త పర్వతాలు యాదవ్, ఢిల్లీ మాధవరెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, తాడూరి పరమేష్, చిన్నం బాలరాజు, ఎమ్మెస్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply