మానవ హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం
- ఎంఆర్ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
- ప్రజా సమస్యల పరిష్కారంలో హక్కుల సంఘాలు ముందుండాలి
విజయవాడ, ఆంధ్రప్రభ: మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో హక్కుల సంఘాలు కీలక పాత్ర పోషించాలని పలువురు న్యాయవాదులు, సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఎంఆర్ మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బెజవాడ బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణుభట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రజల హక్కులు ఉల్లంఘించిన చోట మానవ హక్కుల సంఘాలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అండగా నిలవాలని సూచించారు.
బార్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ.కే. భాష మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలపై సంఘాలు చురుకుగా స్పందించి ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని అన్నారు. ఎంఆర్ మానవ హక్కులు, అవినీతి నిరోధక అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని, సమస్యలు ఎదురైన వారు సంఘాన్ని సంప్రదించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్టేట్ లీగల్ అడ్వైజర్ షేక్ జిలానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి పీ. విష్ణు సాయి, రాష్ట్ర చైర్మన్ పి.ఎల్. శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. సుధీర్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సర్దార్ భాషతో పాటు పలువురు న్యాయవాదులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
