బ్యాలెట్ విధానంపై జాతీయస్థాయి లో చర్చ జరగాలి

కాంగ్రెస్ విజయవాడ పార్లమెంట్ ఇన్‌చార్జి భార్గవ్ వల్లూరు

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్నికల పారదర్శకత, ఓటర్ల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌చార్జి భార్గవ్ వల్లూరు పేర్కొన్నారు.బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గతంలో బ్యాలెట్ బాక్స్ విధానానికి మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహా వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు, ప్రస్తుతం ఎన్నికల సంస్కరణలపై ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగడమే కాకుండా, వాటిపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగేలా పారదర్శకత కూడా ఉండాలని అన్నారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్ విధానాన్ని లేదా కనీసం మరింత బలమైన కాగితాధారిత ధ్రువీకరణ వ్యవస్థలు, స్వతంత్ర ఆడిట్లు, విస్తృత స్థాయి వీవీప్యాట్ పరిశీలన వంటి అంశాలను దేశం తీవ్రంగా పరిశీలించాలని సూచించారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు కాగితాధారిత ఓటింగ్ విధానాలను లేదా బలమైన ధ్రువీకరణ వ్యవస్థలను అమలు చేస్తున్నాయని, బ్రెజిల్ వంటి దేశాల్లో ఓటింగ్ వ్యవస్థలపై స్వతంత్ర ఆడిట్లు, సోర్స్ కోడ్ పరిశీలనకు అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు.

భారతదేశంలో కూడా ఎన్నికల సంఘం ఎన్నికల పారదర్శకతను మరింత పెంచేందుకు స్వతంత్ర ధ్రువీకరణ, విస్తృత వీవీప్యాట్ ఆడిట్లు, స్పష్టమైన ప్రజా జవాబుదారీతనం వంటి సంస్కరణలను పరిశీలించాలని కోరారు. ఎన్నికల విశ్వసనీయతను బలోపేతం చేసే సంస్కరణలను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సమర్థించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతి ఓటరికి పూర్తి నమ్మకం కల్పించడం అందరి బాధ్యత అని భార్గవ్ వల్లూరు పేర్కొన్నారు.